లక్ష్యం నిర్ణయించుకోవటం ఎలా?

"ఓటమికి భయపడేవాడు గెలవలేడు. చావుకు భయపడేవాడు బ్రతకలేడు"

లక్ష్యం నిర్ణయించుకోవటం ఎలా?

ప్రతి వ్యక్తికీ ఒక జీవన గమ్యం ఉంటుంది. ఆ గమ్యం చేరుకోవటానికి అతను ఒక దారి నెన్నుకొని, ఆ బాటలో ప్రయాణం చేస్తాడు. ఈ ప్రయాణంలో అతడు అనేక మైలురాళ్ళు.. దాటాలి. ఒక నిర్దిష్టమైన ప్రణాళిక, కాల నిర్ణయం లేకపోతే ఎన్నటికీ గమ్యం చేరుకోలేడు. అవునా!

గమ్యం చేరుకోటానికి చేసే ప్రయాణంలో మనం దాటాల్సిన 'మైలు రాళ్ళనే లక్ష్యాలు అంటాము. అంటే మనం గమ్యం చేరటానికి మధ్యలో వచ్చే, చిన్న, చిన్న మజిలీలు ఉదాహరణకు నేను అమలాపురం నుండి శ్రీనగర్ వెళ్ళదలచుకొన్నాను. అంటే నాకు

1. శ్రీనగర్ ఎప్పటికి చేరుకోవాలో నిర్దిష్టమైన తేదీ తెలియాలి. ఉదా: మార్చి 31. 2. మార్చి 31కి, శ్రీనగర్ చేరాలంటే నేను ఢిల్లీలో మార్చి 30 కల్లా ఉండాలి.

3. ఢిల్లీలో మార్చి 30 కల్లా ఉండాలంటే 28, 29 తేదీల్లో హైదరాబాదులో బయలుదేరాలి. 4. మార్చి 28న హైదరాబాదులో ఉండాలంటే.

5. మార్చి 27న అమలాపురంలో బయలుదేరాలి. అంటే శ్రీనగర్ అనే నా గమ్యాన్ని మార్చి 31 కల్లా చేరాలంటే, మార్చి 27న అమలాపురం
లో బయలుదేరి, హైదరాబాదు, ఢిల్లీ అనే లక్ష్యాలను నిర్ణీత సమయంలో చేరాలి..

ఇంకో ఉదాహరణ. మీరు మార్చి 2007 నాటికి ఒక మంచి ఇల్లు కొనాలనుకొంటున్నారు. దీన్ని మీరు చిన్న చిన్న లక్ష్యాలుగా విభజించుకోవాలి. ఎక్కడ కొనుక్కోవాలి, ఎంత వైశాల్యంలో ఉండాలి? ఏ పరిసరాల్లో ఉండాలి? దీనికెంత డబ్బు కావాలి? నా దగ్గర ఎంత సొమ్ముంది? మిగిలిన డబ్బు ఎలా వస్తుంది? ఎవరైనా అప్పుగా ఇస్తారా? తక్కువ వడ్డీతో ఎవరప్పిస్తారు? నెలసరి ఎంత కట్టవలసి వస్తుంది. మొత్తం పనిని ఇలా చిన్న చిన్న భాగాలుగా విడగొట్టి, వాటిని సాధించటానికి కాల వ్యవధి నిర్ణయించుకోవటాన్నే లక్ష్యాలు నిర్ణయించుకోవటం అంటారు. లక్ష్యానికి ముఖ్యంగా 5 లక్షణాలుండాలి. దీన్ని స్మార్ట్ అంటారు. స్పెసిఫిక్, మెజరబుల్, అటెయినబుల్, రెలవెంట్ అండ్ టైమ్ బౌండ్ ఇవేంటో చూద్దాం.

స్పెసిఫిక్ : అంటే మన లక్ష్యం నిర్దిష్టంగా ఉండాలి. నాకు కారు కావాలి అని రాస్తే సరిపోదు. ఏ కారు? ఏ మోడల్, ఏ రంగు? ఏమేమి ఫిట్టింగ్సు ఉండాలి? ఏ.సి./ నాన్ ఏ.సి. ఇలా ఎంత నిర్దుష్టంగా ఉంటే అంత మంచిది.

మెజరబుల్ కారు కావాలి. ఎంకౌతుంది? ఎందుకంటే దానికి సరిపడ డబ్బు ఉంటే గానీ మనం ఆ కారు కొనలేం. కాబట్టి మనకి నికరంగా ఎంత డబ్బు కావాలి? ఎంత సంపాదించాం అనేది నిర్దిష్టంగా తెలిసేటట్లుండాలి. దీని వల్ల మన లక్ష్యానికి మనమెంత దూరంలో ఉన్నామో బేరీజు వేసుకోవచ్చు.

అటేయినబుల్ మనం చేరుకోగల లక్ష్యం ఉండాలి. ఒక సంవత్సరంలో (మార్చి 2006కల్లా మెర్సిడిస్ బెంజ్ కారు కొనాలని లక్ష్యంగా పెట్టుకొన్నామనుకోండి. దాని ఖరీదు సుమారు 70 లక్షలనుకోండి. అంటే మనం చేసే వ్యాపారం ద్వారా కానీ, ఉద్యోగం ద్వారా కానీ నెలకి సుమారు రూ.6 లక్షలు ఆర్జించాలి. మీ ప్రస్తుత ఆదాయం నెలకి రూ.4 లక్షలుంటే ఇది సంభవం కావచ్చు. కానీ ఇవాళ మన ఆదాయం నెలకి రూ.25,000 అయితే ఇది మనం చేరుకోగల లక్ష్యం కాదు. మన లక్ష్యం మనకి మామూలుగా అందుబాటులో ఉన్నా దానికంటే ఉన్నతంగా ఉండాలి కానీ మీరు ఎగిరినా అందుకోలేనంత ఉంటే పూర్తిగా నిరుత్సాహపడే ప్రమాదముంది.

రెలెవెంట్: నేనో కంపెనీలో ఎకౌంటెంట్గా పని చేస్తున్నాను. నేను గొప్ప సైంటిస్టు నౌదా మని లక్ష్యంగా పెట్టుకొంటే, నా పరిస్థితికీ, నా లక్ష్యానికి పొత్తు కుదరదు. కాబట్టి మనం ఎన్నుకొనే లక్ష్యం మన పరిస్థితికి, అనువైనదీ, అనుగుణమైనదీ (సాధ్యమైనదని కాదు అయి ఉండాలి.

టైమ్ బౌండ్ : ఇందాక చూసిన ఉదాహరణలో మనం శ్రీనగర్ మార్చి 31కి చేరాలంటే, ఢిల్లీ ఎప్పుడు చేరాలి, హైదరాబాదు ఎప్పుడు చేరాలి అనే తారీఖులు నిర్ణయమౌతాయి. అలాగే మన జీవన గమ్యానికి మనం పెట్టుకొన్న సమయ నిర్దేశాన్ననుసరించి మన లక్ష్యాలు చేరుకోవలసిన సమయం కూడ నిర్ణయమౌతుంది. ఇది చాలా ముఖ్యం.

Comments

Popular posts from this blog

25 steps for building a positive personality

శారదాదేవి( sarada devi)

మందపల్లి శ్రీనివాసులు