విలువలు
ప్రతివారికీ జీవితంలో కొన్ని విలువలుంటాయి.
మీ విలువ లేమిటి? మరి మీరే విలువల ప్రకారం జీవిస్తున్నారు? ఏనాడైనా ఆలోచించారా? ఎందుకంటే మీ జీవిత సాఫల్యతకు
మీ విలువలే ఆధారం. వీటి ద్వారానే మీరు మీ జీవిత పరమార్థాన్ని సాధించుకోవాలి.
మీ విలువలే మీ వ్యక్తిత్వ వికాసానికి మూలం.
మీ విలువలేమిటో మీరు తెలుసుకోదలుచుకొన్నారా?
మీలో ఎందరు మీ జీవిత పరమార్థమేమిటో నిర్ణయించుకొని దాని కోసం పని చేస్తున్నారు. ఒకవేళ మీ జవాబు 'లేదు', 'తెలియదు' అయితే ఈ క్రింద ఇవ్వబడిన ప్రక్రియ మీ కోసమే. దీనిని మీరు అర్థం చేసుకొని, సవ్యంగా ఆచరిస్తే మీరు మీ జీవిత పరమార్థాన్ని నిర్ణయించు కోగలుగుతారు.
మరోమాట, ఈ పరమార్థం మారే అవకాశం చాలా ఎక్కువ. కానీ అసలు ఇవాల్టి పరిస్థితిలో మన లక్ష్యం, గమ్యం ఏమిటో మనకి తెలిస్తే ఆ దారిలో నడచి అవసరాన్ని బట్టి మార్పులు చేసుకొంటూ ముందుకి నడవవచ్చు. లేకపోతే అసలు మొదలే ఉండదు.
ఈ విలువల్నే మీరు జీవిస్తారు. పాటిస్తారు. అలాటి విలువల్ని పాటించే వారితోనే స్నేహం చేస్తారు. మీ జీవన లక్ష్యాలు, కలలూ సాధించుకోవటానికి మూలం ఈ విలువలు. ఈ విలువలే మీ మనస్తత్వాన్ని, మీ పనితనాన్ని ఇష్టాఇష్టాలనీ తీర్చిదిద్దుతాయి. కాబట్టి మీరు మీ విలువలేమిటో తెలుసుకోవటం అతి ముఖ్యం. చెప్పండి. జీవితంలో మీరు పాటించే విలువలేమిటి?... ఉన్నట్టుండి అడిగితే కష్టం అవునా?
అందుకే కాగితం కలం తీసుకొని మీ విలువలేమిటో రాయండి. అనుమానం వచ్చినా, ఆ విలువను కాగితం మీద రాయండి. తరువాత కావాలంటే కొట్టేయచ్చు.
మీకు మార్గనిర్దేశకంగా ఉండేందుకు కొన్ని ఉదాహరణలు గా విలువల్ని వాటి అర్థాలతో క్రింద తెలియజేస్తున్నా. ఇవి మీ 'విలువలో' కాదో మాకు తెలియదు. క్రింద ఇచ్చి జాబితా సంపూర్ణం కాదు. కేవలం మీ ఆలోచనలను ఓ మార్గం వైపు మళ్ళించటానికే. ఇవి కాకుండా మరే ఇతరం ఉన్నా రాయండి.
మీ “మౌలిక విలువల్ని” మీరు గుర్తించటమే ఇప్పుడు మనకు కావలిసింది.
1. ఆర్థిక భద్రత :
మీ బాధ్యతల్ని నిర్వర్తించటానికి కావలసినంత డబ్బు కలిగి ఉండటం. మీ మనసు, బుద్ధి ఆర్థిక విషయాల కోసం ఆలోచనలో పడే పరిస్థితి లేకపోవటం.
2. స్వాతంత్య్రం :
మీ జీవితాన్ని, మీ ఇష్టమొచ్చినట్లు జీవించటం. ఎవరి మీదా ఆధారపడ వలసిన అవసరం లేకపోవటం. ఇది అంతర్గతంగా కావచ్చు లేదా బాహ్యంగా కావచ్చు.
3. విజయం :
మీ లక్ష్యాలను సాధిస్తూ కొత్త లక్ష్యాల వైపు పరుగు తీస్తూ మీ జీవన గమ్యం వైపు చేసే ఉత్తేజకర ప్రయాణం.
4. ఆనందం :
అన్నీసమకూరాయన్న తృప్తి, నిండుదనం, మానసిక స్థితి.
5. ప్రేమ :
అందరితో ఆప్యాయత పంచుకోగలగటం. ఎవరినీ నొప్పించకపోవటం. పంచుకోవటం. అందరినీ పట్టించుకోవటం. స్వార్థరహితంగా బాధ్యత తీసుకోవటం..
6. ఆరోగ్యం : శారీరిక, మానసిక ఆరోగ్యం.
7. వ్యక్తిగత సత్య తత్పరత:
నమ్మిన దాని కోసం పని చేయటం. ప్రలోభాలకు గురికాక పోవటం.
8. సేవ :
అవతలి వారికి నిస్వార్థంగా సాయం చేయటం, ఇవ్వటం.
9. శాంతి :
వాతావరణానికీ, పరిస్థితులకూ, వ్యక్తులకూ చెక్కు చెదరని అంతర్గత తటస్థత్వం.
10. ఉత్తేజం :
అంతర్గత ఉత్సాహం, స్వశక్తి మీద నమ్మకం.
11. గుర్తింపు :
ఒక విశిష్టత, గొప్పతనం, భళా! గ్రేట్!శభాష్! అనిపించుకోగల్గటం. ఇలాగే, క్షేమం, ఉదాసీనత, సౌశీల్యం, గాంభీర్యం, దాతృత్వం, మానవత్వం, పద్ధతి, దయ, దానగుణం వగైరా...
ఇలా మీలో ఎన్నో గుణాలుండచ్చు. కొన్నే ఉండచ్చు. ముఖ్యంగా మీలో మీరాధించేవీ, మిమ్మల్ని ఉత్తేజితుల్ని చేసేవీ, ముఖ్యమైనవి 5 విలువల్ని మీరు కాగితం మీద రాయండి. ఇప్పుడు మీరు మీ జీవిత పరమార్థాన్ని గుర్తించే ప్రయత్నంలో ఉన్నారు. ఈ కార్యక్రమం పూర్తవటానికి సుమారు 15 నుండి 20 నిముషాలు పట్టవచ్చు. కొంచెం ఓపికతో సహనంతో, నిజాయితీతో ఈ కార్యక్రమంలో పాల్గొనండి. ఎందుకంటే ఇది మిమ్మల్ని మీరు కనుక్కొనే ప్రక్రియ.
మీరు రాసిందెవరూ చూడబోవటల్లేదు. మెచ్చుకోబోవటల్లేదు, చిన్నబుచ్చ బోవట్లేదు. ఈ కార్యక్రమం అంతా మీరు ఎప్పుడు మొదలు పెట్టినా కూడా మార్చవచ్చు.ఈ కార్యక్రమం అంతా మీరు ఎప్పుడు మొదలు పెట్టినా పూర్తయ్యేవరకూ (15 ని॥లు) కొనసాగిస్తేనే మంచి ఫలిత ముంటుంది.
ఇంకోళ్ళ కోసం రాయకండి.
ఇది మిమ్మల్ని , మీరు తెలుసుకొనే ప్రక్రియ. ఈ 15 నిముషాలు మీ కోసం మీరు మీ మీద పెట్టే పెట్టుబడి - ఇది మీ జీవిత దిశను, దశను కూడా మార్చవచ్చు.
“మీరేం చేయటానికి ఎప్పుడూ ఇష్టపడతారో, అది నిర్ద్వంద్వంగా మీ జీవిత విలువల్ని ప్రతిబింబిస్తుంది. మీకేది చేయటం ఇష్టమో, మిమ్మల్నేది ఉత్తేజితుల్ని చేస్తుందో, ఏమీ ఆశించకుండా ఆ పని చేయటానికిష్టపడతారో అదే మీ జీవన గమ్యం. తెలుసుకోవటానికీ, నిర్ణయించుకోవటానికీ సాయపడుతుంది.
1. మీ అతి ముఖ్యమైన ప్రత్యేకమైన విలువలు ఏమిటి?
పైన మీరు మీ ముఖ్యమైన 5 విలువల్ని రాసి ఉండాలి. రాయకపోతే ఇప్పుడైనా రాయండి. అందులో మీ ప్రత్యేక వ్యక్తిత్వాన్ని ప్రతిబింబించే రెండు విలువల్ని గుర్తించండి. మీ గతం గుర్తు చేసుకోండి. ఎందువల్ల 'అంత ఆనందం' పొందగల్గాను అని తర్కించండి. అందులోంచే మీ ముఖ్యమైన 'జీవన విలువలు' తొంగి చూస్తూ ఉంటాయి. ఆ విలువలూ, గుణాలే మీరూ, మీ ప్రత్యేక వ్యక్తిత్వం. వాటితోనే మీ చుట్టూ ఉన్నవాళ్ళు మిమ్మల్ని గుర్తిస్తారు. కావాలంటే పెద్ద జాబితా రాయండి. "నా జీవిత విలువ " అని మీరు రాసిన ప్రతి విలువని లోపల చదువుకోండి. ఏ పదం పెట్టి చదివినప్పుడు మీరెక్కువ ఉత్తేజితులౌతారో అవే మీ విలువలు. అందులో అతి ముఖ్యం, ముఖ్యం అయిన రెండే రెండు విలువల్ని గుర్తు పట్టండి. అవసరమైతే మీ కుటుంబసభ్యులు, సన్నిహితుల సాయం తీసుకోవచ్చు. కాకపోతే వారి విలువలు మీపై రుద్దకుండా చూసుకోండి.
మీ దృష్టిలో ఆదర్శ ప్రపంచం ఎలా ఉంటుంది?
మీరే కనక సృష్టికర్త అయితే ఆదర్శ ప్రపంచం ఎలా ఉంటుంది? ఉదాహరణకు: (1) నేను సృష్టించే ప్రపంచంలో బీదా, గొప్పా అసమానతలుండవు. (2) నేను సృష్టించే ప్రపంచంలో అదరూ కలిసి మెలిసి ఉంటారు. కక్షలు, కార్పణ్యాలూ ఉండవు.
ఇలా మీకు వీలైనన్ని వాక్యాలు రాసి వాటిలో మీరు చాలా ముఖ్యమనుకొన్నవి రెండు ఎంపిక చేయండి. దయచేసి ఇది ఇంకొకరి కోసం రాయకండి. నిజంగా మీరే సృష్టికర్త అయితే ఏం చేస్తారో మనస్ఫూర్తిగా రాయండి.
4. మీ జీవన గమ్య ప్రణాళికను రాయండి.
ఉదా: నేను నాకున్నంతలో రోజూ ఒక మనిషికి అన్నం పెట్టి అర్హులైన వారికి చదువు కోటానికి పుస్తకాలిచ్చి నాకున్న దాన్ని పంచుతూ, ప్రపంచంలో బీదా, గొప్పా అసమానతలు పోగొట్టడానికి నా వంతు ప్రయత్నం చేస్తాను.
జాగ్రత్తగా గమనిస్తే మీ జీవిత గమ్యం ఏమిటో, అది సాధించటానికి మీరేం చేయదలచు కొన్నారో, ఎలా చేయదలుచుకొన్నారో నిర్దిష్టంగా పై వాక్యంలో నిక్షిప్తమయింది.
మీ సౌలభ్యం కోసం పైన చెప్పిన 4 అంచెల అభ్యాస ప్రక్రియ ఈ క్రింద పొందు పరుస్తున్నాం. దానిని పైన చెప్పిన రీతిలో పూర్తి చేసి, ఈ వ్యాసాన్ని మరోసారి చదవండి. బహుశః మీ జీవన గమ్యం చేరే మార్గం మీకు సాక్షాత్కరించవచ్చు. దాన్ని అమలు చేసి సాధించుకోవటం మీ నిర్ణయం, మీ కార్యాచరణ, కార్యదక్షత మీద ఆధారపడుతుంది.
మీ జీవితం సఫలవంతమగుగాక.
Comments
Post a Comment