భారత దేశంలో బీమా చరిత్ర
బీమా అంటే ఏమిటి?
బీమాను అమ్మే కంపెనీని బీమా సంస్థ
అంటారు. బీమా కొనేవారిని పాలసీ దారుడు అని అంటారు. బీమా పొందడానికి చెల్లించాల్సిన రుసుమును ప్రీమియం అంటారు.
జీవిత బీమా అనగానేమి?
మనిషి తన జీవితం ముగించినా లేదా ఒక మనిషి సహజంగా చనిపోయినా, లేదా తాత్కా లికంగా అంగవైకల్యాన్ని ప్రమాదవశాత్తు
పొందితే, ఆ వ్యక్తి కుటుంబానికి ఆదాయం ఆర్థికంగా నష్టం జరుగుతుంది.ఆర్ధిక పరమైన నష్టాన్ని పూరించేదే జీవిత బీమా.
జీవిత బీమా అనేది ఒక వ్యక్తి మరణం, అంగవైకల్యం, దుర్ఘటన, ఉద్యోగ విరమణ మొదలయినవంటి వాటికి ఆర్థికపరమైన సంరక్షణనిచ్చే సాధనమని అర్థం.
ఇది రిస్క్ మేనేజ్‌మెంట్ లో ఒక రూపం. సరళంగా చెప్పాలంటే, భవిష్యత్తులో జరిగే నష్టాల నుండి మిమ్మల్ని మీరు రక్షించుకోవడానికి ఒక సంస్థకు ఒకే మొత్తాన్ని చెల్లిస్తారు. దీనిని ప్రీమియం అంటారు.అనుకోని సంఘటనలు వల్ల దురదృష్టం జరిగినప్పుడు, ఆ పరిస్థితి నుండి బయట పడటానికి బీమా సంస్థ మీకు/ మీ కుటుంబానికి సహాయం చేస్తుంది.
మనం దేశంలో 'జరిగేది ఏదో జరగక మానదు, అన్నింటికి ఆ భగవంతుడిదే భారంం' అనే భావన ప్రజల్లో ఎక్కువగా ఉండటంవల్ల జీవితబీమా అంతగా వ్యాప్తి చెందలేదు.
చైనీయులు, బాబిలోనియన్ వర్తకులు క్రీ. పూ. 3000 సంవత్సరాల క్రితం ప్రమాదభరితమైన నదులలో ప్రయాణించే సమయంలో నౌకలు అనుకోని తుఫానుల వల్ల, ప్రమాదాల వల్ల మునిగిపోయేవి. అప్పుడు జరిగే నష్టాన్ని పూరించేందుకు చైనా వర్తకులు ముందుగానే కొంత సరుకును నష్టపోయిన వారికి ఇవ్వడానికి అందరూ కలిసి తలా ఇంత వేసి కొంత నిల్వ చేసి ఉంచేవారు.
మనం దేశంలో క్రీ.పూ.500 తరువాత కాలంలో బౌద్దబిక్షువులు తమ మరణం తరువాత జరపాల్సిన క్రతువులకోసం వారు బిక్ష ద్వారా వచ్చిన సొమ్మును తమ బౌద్ధ సంఘం లో ఒకరి దగ్గర పెట్టేవారు. అలా అందరి కోసం కొంత ఫండు ఏర్పాటు కావడం ఒక రకమైన బీమా.
మనం దేశంలో పూర్వం ఉన్న ఉమ్మడి కుటుంబం కూడా కుటుంబానికి ఒక బీమా లాగా ధీమా నిచ్చేది.
గ్రీకులు , రోమన్‌లు ఆరోగ్య భీమా, జీవిత భీమా విధానాన్ని ప్రవేశ పెట్టారు. 600 ADలో, కుటుంబాలను సంరక్షిస్తూ ఎవరైనా చనిపోతే వారి అంత్యక్రియలకు అయ్యే ఖర్చులను భరిస్తూ "దయ గల సంఘాలు" అని పిలవబడే సమాజాలను నిర్వహించేవారు.
1666లో లండన్ లో 13,200 ఇళ్ళు దగ్దమైనాయి. ఈ దుర్ఘటన తరువాత నికోలస్ బర్బోన్ అనే వ్యక్తి భవనాలను బీమా చేసేందుకు ఒక కార్యాలయాన్ని స్థాపించాడు. 1680లో ఇటుక లతో నిర్మించిన ఇళ్ళను బీమా చేసేందుకు ఇంగ్లాండ్‌లో మొట్టమొదటి అగ్ని బీమా సంస్థ "ద ఫైర్ హౌస్"ను స్థాపించాడు. అప్పటి నుండి బీమా వ్యాపారం ప్రపంచంలో ప్రారంభమైంది. ఆ తరువాత జీవిత బీమా వ్యాపారం కూడా ప్రారంభమైంది.
1818 లో కోల్‌కత లో ప్రారంభమైన ఓరియంటల్ లైఫ్ ఇన్‌స్యూరెన్స్ కంపెనీ భారతదేశంలో మొట్టమొదటి జీవిత బీమా వ్యాపారసంస్థ. దీనిని భారతదేశంలో ఆంగ్లేయులు ఏర్పాటు చేశారు. 1870లో ముంబాయి (bombay)
లో బాంబే మ్యూచువల్ ఎస్యూరెన్స్ సొసైటీ లిమిటెడ్ ఏర్పడింది.దీనిని మన భారతీయులే నెలకొల్పారు. జాతీయోద్యమ కాలంలో తరువాత చాలా భారతీయ కంపెనీలు ఏర్పాటయ్యాయి. సురేంద్రనాథ్ టాగూర్ హిందుస్థాన్ ఇన్‌స్యూరెన్స్ సొసైటీని స్థాపించాడు.
భారతదేశంలో బీమా కంపెనీలను నియంత్రించడానికి మొట్టమొదటిగా చేయబడిన చట్టం బీమా చట్టం 1938. ఈ చట్టం కాలాను గుణంగా అప్పుడప్పుడూ మార్పులకు గురవుతూ అమల్లోనే ఉంది. బీమా నిబంధనల ప్రకారం ప్రభుత్వం ఒక బీమా కంట్రోలర్ ను నియమిస్తుంది.
భారతదేశంలో 170 కంపెనీలు, అలాగే 75 ప్రావిడెంట్ ఫండ్ సొసైటీలు ఉండేవి.ఈ ప్రైవేటు కంపెనీలు బీమా వ్యాపారం ద్వారా సేకరించిన పొదుపు మొత్తాన్ని ప్రజా ప్రయోజనం కోసం ఉపయోగించిన దాఖలాలు ఒకటి కూడా లేదు. అంతే గాక ఎవరు పోగేసింది వాళ్లే దిగ మింగేసి పట్టాదారుల నెత్తిన శరగోపం పెట్టడంవారికి వెన్నతో పెట్టిన విద్య.దాంతో పాలసీదారుల సొమ్ము ప్రైవేటు కంపెనీల వ్యక్తిగత పెట్టుబడిగా ఉపయోగపడేది.
ఆనాటి ప్రైవేటు కంపెనీల చేతులలో పాలసీదార్ల సొమ్ము భద్రం కాదని భావించిన ప్రభుత్వం చివరికి 1956 సెప్టెంబర్ 1న జీవిత బీమా వ్యాపారాన్ని జాతీయం చేసి పార్లమెంటు లో చట్టం చేస్తూ భారత జీవిత బీమా కొర్పొరేషన్
(LIC) సంస్థ ను ఏర్పరిచింది. అప్పుడు యల్. ఐ. సిని ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం పెట్టిన పెట్టుబడి 5 కోట్లు మాత్రమే. 1956 నుంచి 1999 వరకు LICకి భారతదేశంలో జీవిత బీమా వ్యాపారం చేయడానికి ప్రత్యేక హక్కులు ఉండేవి.1999లో ఐ ఆర్ డి ఏ ఏర్పాటు తో LIC కి పోటిగా అనేక ప్రైవేటు సంస్థలు మళ్లీ ఏర్పడినాయి.
ప్రస్తుతం భారతదేశంలో 24 జీవిత బీమా కంపెనీలు పనిచేస్తున్నాయి :
a) భారతీయ జీవిత బీమా సంస్థ LIC ఒక పబ్లిక్ రంగ సంస్థ.
b) ప్రైవేటు రంగంలో 23 జీవిత బీమా కంపెనీలు ఉన్నాయి.
c) భారత ప్రభుత్వం ద్వారా నడపబడుతున్న తపాలా విభాగం కూడా తపాలా జీవిత బీమా ద్వారా జీవిత బీమా వ్యాపారంలో ఉంది. కానీ అది రెగ్యులేటర్ పరిధి నుంచి మినహాయించబడింది.
Comments
Post a Comment